Content-Length: 222439 | pFad | https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%B2%E0%B1%82%E0%B0%AA%E0%B0%BF

ఉలూపి - వికీపీడియా Jump to content

ఉలూపి

వికీపీడియా నుండి
Ulupi
ఉలూపి
ఉలూపి , అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది.
దేవనాగరిउलूपी
అనుబంధంనాగా యువరాణి
భర్త / భార్యఅర్జునుడు
పిల్లలుఇర్వాన్‌
పాఠ్యగ్రంథాలువిష్ణు పురాణం
మహాభారతం
తండ్రినాగరాజు కౌరవ్య
A portrait of ఉలూపి and Arjuna
ఉలూపి అర్జునుడు

ఉలూపి మహాభారతం లో ఒక పాత్ర. నాగరాజు కౌరవ్య కుమార్తె, అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది. ఆమె విష్ణు పురాణం భాగవత పురాణంలలో కూడా ప్రస్తావించబడింది. అర్జునుడు, ఉలుపి సంబంధం గురించి మహాభారతంలోని ఆదిపర్వంలో పేర్కొన్నారు.[1]


ఉలూపినికీ అనేక పేర్లతో

[మార్చు]

ఉలుపిని మహాభారతం - భుజగత్మజ, భుజగేంద్రకన్యక, భుజగోట్టమ కౌరవ, కౌరవ్యదుహిత, కౌరవ్యకులానందీ, పన్నగానందినా, పన్నగసుత, పన్నగ, మగజమజలో ఉలాపే, ఉలూపి, ఉలుచి, లేదా ఉలూచి అని అనేక పేర్లతో పిలుస్తారు. మహాభారతంలో ఉలుపి గురించి చాలా తక్కువ చెప్పబడింది.

నీటి అడుగున రాజ్యాం

[మార్చు]

ఉలూపిని నాగాకన్య (నాగా యువరాణి) బాగా శిక్షణ పొందిన యోధురాలు, ఆమె తండ్రి గంగా నది నదిలో పాముల నీటి అడుగున రాజ్యాన్ని పరిపాలించారు. సగం కన్య సగం పాము పౌరాణిక రూపంగా వర్ణించారు. నడుము క్రింద ఉన్న భాగం పాము లేదా మొసలిని పోలి ఉంటుంది.

భూమి ప్రదక్షిణము

[మార్చు]

పాండవులలో ఎవరైనా ద్రౌపదితో ఏకాంతంగా ఉంటే.. మిగిలిన వారు ఆ వైపుకు వెళ్లకూడదనే నియమం వారికి వారే విధించుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే, ఆ పాపానికి పరిహారంగా వారు భూ ప్రదక్షణ చేసిరావలసి ఉంటుందని నియమం పెట్టుకుంటారు. ఈ నియమంతో మూడవ పాండవ సోదరుడు అర్జునుడు, రాజ్య రాజధాని నగరమైన ఇంద్రప్రస్థ నుండి బహిష్కరించబడ్డాడు. బ్రాహ్మణులతో కలిసి, అర్జునుడు నేటి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి వెళ్తాడు.

ఈ నియమమే అర్జునుడు-ఉలూచిల వివాహానికి దారి తీసింది. అర్ధాంగిగా పాండవుల మనసెరిగి ద్రౌపది మసలుకుంటూ వుంటుంది. అలా ధర్మరాజుతో ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడు అటువైపు వెళ్లాల్సి వస్తుంది. గోబ్రాహ్మణ రక్షణార్థం అర్జునుడు తన ధనుర్భాణాల కోసం ద్రౌపది - ధర్మరాజు ఏకాంతంగా వున్న చోటుకి వెళతాడు. సాధుజీవులను రక్షించడానికే అయినా, నియమ ఉల్లంఘన జరిగింది, కనుక అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరుతాడు. అలా వివిధ తీర్థాలను దర్శిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీతీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన ఒక రోజు అర్జునుడు తన కర్మలు చేయటానికి గంగా నదిలో స్నానం చేసినప్పుడు, అదే సమయానికీ ఆ గంగానదిలో పాతాలలోకం లోని సర్పరాజు (నాగా యువరాణి) ఈ ఉలూపి, ఈదులాటగా(ఈత) జలవిహారంలో అటుగా స్నేహితులతో వచ్చి ఆ గంగానదిలో స్నానం చేయడానికి వచ్చిన ఆజానుభాహూడు యైన అర్జునుడి అందాన్ని చూసి మొదటిచూపులోనే ఈ సర్పరాణి ప్రేమలో పడుతుంది. ఆమె తన వంశాన్ని వెల్లడిస్తుంది, ఆమె అతనితో ప్రేమలో పడినట్లు వివరించింది. అర్జునుడు తన తీర్థయాత్రపై బ్రహ్మచర్యాన్ని పేర్కొంటూ ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. తన బ్రహ్మచర్యం అర్జునుడి మొదటి భార్య ద్రౌపదికి మాత్రమే పరిమితం అని ఉలుపితో వాదించాడు. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని నాగ యువరాణి ఉలుపి అతన్ని పట్టుకుని నదిలోకి స్నేహితులతో వచ్చి లాగారని తరువాత అతను తెలుసుకుంటాడు. అర్జునుడిని కాళ్ళు చేతులను బంధించి పాతాలలోకానికి తీసుకువెళ్తుంది, ఆమె అతన్ని తన చేతులతో పట్టుకొని తన ఇష్టానుసారం ప్రయాణించింది. వారు చివరకు కౌర్వయ నివాసమైన నీటి అడుగున రాజ్యంలో పాతాలలోకం లోని సర్పరాజు తన నాగలోకానికి తీసుకొని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. "భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడివానిన్ గామించి తోడి తేఁ దగవా? మగువ ! వివేక మించుకైన వలదా ?" అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని... అన్నది. తన లోకానికి తీసుకువెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. సర్పరాజుకు ఇది నచ్చదు, అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేయగా ఉలూపి నరక జ్వాలల నుంచి కాపాడుతుంది. ఉలూపి ప్రేమకు ముగ్ధుడైన అర్జునుడు, అర్జునుడి శౌర్యపరాక్రమాలను గురించి విని వున్న నాగరాజు తన కూతురైని అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆమెతో గడుపుతాడు. ఇర్వాన్ అనే కుమారుడు వారికి జన్మించాడు. అర్జునుడితో సంతోషించిన ఉలుపి, నీటిలో నివసించే జంతువులన్నీ అతనికి కట్టుబడి ఉంటాయని, అతను నీటిలో అజేయంగా ఉంటాడని అతనికి ఒక వరం ఇస్తుంది. తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూపికి నచ్చచెప్పి అక్కడనుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు.

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత

[మార్చు]

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. ఇందుకు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి పాండవ సోదరులు తీసుకొచ్చారు. వేదోక్త విధులు నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దీనికి కాపలాగా అర్జునుడు గాండీవం, అక్షయ తూణీరం ధరించి వెళ్లాడు. అది త్రిగర్త, ప్రాగ్జోతిషపురం, సింధుదేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది. తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయం తెలిసిన మణిపురం యువరాజు బభ్రువాహనుడు ఆయనకు ఎదురెళ్లి నమస్కరించాడు. అర్జునుడు తన కుమారుని ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు. ఈ నిరాదరణకు కారణం తెలియని బభ్రవాహనుడు మౌనంగా పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటనతో కలత చెందిన అతడు విచారంగా వెనుదిరిగాడు. ఈ సమయంలో ఒక స్త్రీ ఎదురుగావచ్చి, ‘నాయనా నేను నీకు అమ్మనవుతాను.. ఓ నాగకన్యను! నా పేరు ఉలూపి. నీకు హితం చెప్పడానికి వచ్చాను. యుద్ధం రాజధర్మం. వెళ్లి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుందని’ చెప్పింది. ఉలూపి మాటలకు బదులిచ్చి బభ్రువాహనుడు.. తల్లీ తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను తప్పా, పిరికివాడిని కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించి అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడ్డాడు. దీనిని చూసి మెచ్చుకున్న పార్థుడు, అతడితో యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్యా చాలాసేపు యుద్ధం సాగుతుండగా, చివరకు లిప్తపాటులో కొడుకు వేసిన శరం సవ్యసాచి గుండెల్లో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు. అదే క్షణంలో పార్థుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు మూర్చపోయాడు.

ఈ విషయం గురించి బభ్రువాహనుడి సేనలు తల్లి చిత్రాంగదకు తెలియజేశారు. ఉలూపితో సహా యుద్ధభూమికి వచ్చిన చిత్రాంగద, రథానికి అడ్డంగా పడివున్న కొడుకును, నిర్జీవంగా ఉన్న భర్తను చూసి దుఃఖించింది. సోదరీ ఈ పసివాడ్ని ఎందుకు యుద్ధానికి ప్రోత్సహించావు? కొడుకు శౌర్యానికి బలైన ఈ కురుకులవరేణ్యుణ్ణి నువ్వు బతికించకపోతే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అంటూ చిత్రాంగద పద్మాసనం వేసుకుని కూర్చుంది. కాసేపటికి తేరుకున్న బభ్రువాహనుడు... తండ్రిని చంపిన పాపానికి తానూ ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు.

వీరితోపాటు ఉలూపి కూడా కన్నీరుపెట్టుకుని, మృత సంజీవనీమణిని తలుచుకుంది. వెంటనే ఆ మణి ఆమె చేతులలోకి రావడంతో దానిని బభ్రువాహనుడికి అందజేసింది. కుమారా విజయుడికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మణిని ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కి ఇచ్చింది. ఉలూపి వద్ద నుంచి మణిని తీసుకున్న బభ్రువాహనుడు దానిని అర్జునుడి హృదయానికి తాకించగానే నిద్రనుంచి మేలుకున్నట్టు లేచి కూర్చున్నాడు.

అనంతరం ఉలూపి మాట్లాడుతూ... శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు కాబట్టి అది పాపం.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది.. కావాలనే బభ్రువాహనుడిని మీతో యుద్ధానికి ఉసిగొల్పానని, తనను మన్నించమని వేడుకుంది. అంతేకాదు, ఒకరోజు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్లిన సమయంలో వసువులంతా అక్కడకు వచ్చారు. వారు ఒక రేవులో స్నానం చేస్తుండగా ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది. తల్లీ.. శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు, ఇది అన్యాయం కదా? అన్నారు వసువులు. దీనికి ఆగ్రహించిన గంగాదేవి ‘కన్నకొడుకు చేతిలోనే అర్జునుడు హతమవుగాక’ అని శపించింది.

అక్కడే ఉన్న తాను మా తండ్రికి ఈ విషయం చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని ప్రార్థించడంతో ప్రసన్నం చెందింది. అర్జునుడు తన కుమారుడు బభ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడు.. అయితే, నాగలోకంలోని మృతసంజీవని మణి వల్ల పునరుజ్జీవితుడు అవుతాడనీ ఉపాయం చెప్పింది. అందువల్లే బభ్రువాహనుణ్ణి మీతో యుద్ధానికి పురికొల్పి, మహాశౌర్యం ఆవహింపజేశానని తెలిపింది. కుమారుడు వల్ల కూలిన మీ దేహాన్ని మృతసంజీవనిమణితో తిరిగి సజీవం చేశానని ఉలూపి చెప్పింది. దీనికి సంతోషించిన అర్జునుడు... ఉలూపి నీ వల్ల మా కులం నిలబడింది.. కులవర్థినివి నువ్వు అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. కొడుకును ఆశీర్వదించి, చిత్రాంగదను దీవించి వారందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు.

వసువుల కోపానుగ్రహ వృత్తాంతం

[మార్చు]

సంజీవమణితో పునరుజ్జీవితుడయిన అర్జునుడు, యుద్ధరంగంలో చిత్రాంగదనూ, ఉలూపినీ చూశాడు ఆశ్చర్యపోయాడు. భార్యలు యుద్ధభూమిలో కనిపించేసరికి అతనిలో అనేక అనుమానాలు చెలరేగాయి. ముఖ్యంగా ఉలూపి రాక అర్జునుని ఊహకి అందలేదు. బభ్రువాహనుడు ఆమెకు ఏదయినా హాని తలపెట్టాడేమోనని సందేహం కలిగింది. అదే మాట ఉలూపిని అడిగాడతను.‘నువ్వుగాని, బభ్రువాహనుడుగాని నాకెందుకు హాని తలపెడతారు. ఒకరు భర్త, మరొకరు పుత్రుడు.’’ అని నవ్వింది ఉలూపి. అనుమానంగా చిత్రంగద వైపు చూశాడు అర్జునుడు.‘‘చెల్లెలు చిత్రాంగద కూడా నాకు ఎలాంటి అపకారాన్నీ తలపెట్టలేదు నాథా! అసలు జరిగింది ఏమిటంటే... ‘ఏం జరిగింది?’ ఆసక్తి కనబరిచాడు అర్జునుడు. ఉలూపి చెప్పసాగిందిలా. ‘బభ్రువాహనుడి చేతిలో నువ్వు మరణించావు.’ ‘నేను మరణించానా? ’ ఆశ్చర్యపోయాడు అర్జునుడు.‘‘అవును ప్రభూ! నువ్వు బభ్రువాహనుడి చేతిలో మరణించావు. అది ఎందుకు సంభవించిందంటే...శిఖండిని ముందు ఉంచుకుని ఆనాడు నువ్వు భీష్ముని చంపావు చూడూ, అది తప్పు. మహాపాపం. ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం జరగాలి. జరగని పక్షంలో నువ్వు మరణించి ఘోర నరకాన్ని చవి చూడాల్సి వచ్చేది. అలా జరగరాదనుకున్నాను. నువ్వు నరకానికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే తగిన ప్రాయశ్చిత్తం జరగాలి. జరగాలంటే నిన్ను నీ కొడుకు బభ్రువాహనుడు చంపాలి. చంపాడు. కాదు, నేనే చంపించాను.’ అన్నది ఉలూచి. అర్థం కాలేదు అర్జునుడికి. చిత్రాంగద, బభ్రువాహనులు కూడా ఏదీ అర్థం కానట్టుగా ఉలూచిని చూశారు. ‘ఒకనాడు చెలికత్తెలతో కలసి స్నానం చేసేందుకు గంగాతీరం చేరుకున్నాను. అక్కడికి నేను చేరేనాటికి, గంగాదేవితో వసువులు మాట్లాడుతున్నారు. వారి మాటల్లో ‘అర్జునుడు’ అన్న మాట వినరావడంతో చెట్టు చాటుగా ఉండి, అంతా విన్నాను.‘శిఖండిని ముందు ఉంచుకుని, అర్జునుడు భీష్ముణ్ణి చంపాడు. అది కుత్సిత విజయం. ఆ పాపానికి తగిన శిక్ష అర్జునుడు అనుభవించాలి. అందుకు అతన్ని శపించాలని అనుకుంటున్నాం.’ అన్నారు వసువులు.‘మీ ఇష్టం.’ అన్నది గంగాదేవి. అదృశ్యులయ్యారు వారంతా. నేను మరి స్నానం మాటే తలపెట్టలేదు. పరుగు పరుగున మా తండ్రిగారిని చేరుకున్నాను. విన్నదంతా విన్నవించానతనికి. ఆందోళన చెందాడు నా తండ్రి. వెళ్ళి వసువుల కాళ్ళ మీద పడ్డాడు. అర్జునుని రక్షించమని ప్రాధేయపడ్డాడు. ప్రార్థించాడు.అప్పుడు శాంతించారు వసువులు. భీష్ముణ్ణి చంపిన పాపం పోవాలంటే తన కొడుకు చేతిలో అర్జునుడు మరణించాలన్నారు. అలా మరణిస్తే పాపం పోతుందని, అప్పుడు నరకం సంప్రాప్తించదని అన్నారు.’’ అన్నది ఉలూపి.ఉత్కంఠగా వింటున్నారంతా. అర్జునునితో మళ్ళీ అన్నదిలా ఉలూపి.‘‘ఎప్పుడయితే యగాశ్వాన్ని బంధించి, బభ్రువాహనుణ్ణి నువ్వు యుద్ధానికి కవ్వించావో అప్పుడు అదంతా దివ్యదృష్టితో గమనించిన నేను, ఇదే సరయిన సమయం అనుకున్నాను. తండ్రితో యుద్ధమేమిటని ఆలోచిస్తున్న బభ్రువాహనుణ్ణి ‘తండ్రి కోరుకుంటున్నది చేయడంలో తప్పులేదు’ అన్నాను. యుద్ధం చేయమని ప్రోత్సహించాను. వసువుల శాపం ఫలించి తీరాలని బభ్రువాహనుని శస్త్రాస్త్రాలకు అతిలోక శక్తి ప్రసాదించాను. ఫలితమే నీ మరణం. 'దేవీ' అన్నాడు అర్జునుడు. కృతజ్ఞతగా ఉలూపిని దగ్గరగా తీసుకున్నాడు.‘మా వంశ శ్రేయోభివృద్ధికై సదా శుభకర్మలు ఆచరించే నిన్ను అభినందించలేకుండా ఉన్నాను.’ అన్నాడు అర్జునుడు.

మెచ్చుకున్నాడామెను. చిత్రాంగదను కూడా చేరబిలిచాడు. ఆనందబాష్పాలతో దగ్గరగా వచ్చిన చిత్రాంగదను చేతులు జాచి పొదివికున్నాడు. ‘విలువిద్యలో నీ కుమారుడు తండ్రిని మించాడు.’ అన్నాడు. సన్నగా నవ్వించాడామెను. ‘కుమారా’ ‘తండ్రీ’ ‘రానున్న చైత్రమాస పౌర్ణమి అశ్వమేధ నిర్వహణ శుభసమయం. తల్లులతో, బంధు మిత్ర సపరివారంగా నువ్వుక్కడకి విచ్చేసి, ధర్మనందనుని సగౌరవార్చన అందుకో’ అన్నాడు అర్జునుడు. ‘ఆజ్ఞ’ అన్నాడు బభ్రువాహనుడు. చేతులు జోడించాడు. 'తండ్రీ' 'చెప్పు 'రాకుమారా' కొద్ది రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. రండి, అంతఃపురానికి వెళ్దాం. ‘రాలేను రాకుమారా యాగాశ్వ సంరక్షణ దీక్షలో ఉన్నవారికి అంతఃపుర ప్రవేశం తగదు. ఇప్పుడు రాలేను. అమ్మలతో పాటు హస్తినాపురికి తరలి రా, అక్కడ కలుద్దాం.’ అన్నాడు అర్జునుడు. రథాన్ని అధిరోహించాడు. కదిలింది రథం. వీడ్కోలు పలికారు ఉలూపి చిత్రాంగద బభ్రువాహనులు. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి అర్జునుడు.అర్జునుడు యాగాశ్వమును అనుసరిస్తూ హస్థినాపురప్రవేశము చేసాడు. వంధిమాగధులు, హస్థినాపురప్రజలు అర్జునుడిని వేనోళ్ళ కొనియాడసాగారు. అర్జునుడు యాగశాలను సమీపించగానే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు అర్జునుడికి ఎదురు వెళ్ళి స్వాగతము పలికి సాదరంగా యాగశాలకు తీసుకుని వెళ్ళారు. అర్జునుడు ముందుగా ధృతరాష్ట్ర గాంధారులను తరువాత కుంతీదేవిని దర్శించి వారి ఆశీర్వాదములు అందుకున్నాడు. ఇంతలో అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగధలు బభ్రువాహనుడు హస్థినకు వచ్చి చేరారు. అర్జునుడు తన భార్యలను, కుమారుడిని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళి పరిచయము చేసాడు. తరువాత ధృతరాష్ట్ర, గాంధారీల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదము అందుకున్నాడు. తరువాత తల్లి కుంతీదేవికి కోడళ్ళను మనుమడిని చూపించాడు. కుంతీదేవి వారిని ఆనందముతో ఆదరించి ఆశీర్వదించింది. తరువాత చిత్రాంగధ, ఉలూపి ద్రౌపదిని సుభద్రను కలిసారు. అందరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. ఈ విధంగా అశ్వమేధయాగ సన్నాహాలు పూర్తి అయ్యాయి.

పాండవుల పదవీ విరమణ

[మార్చు]

కలియుగం ప్రారంభమైన తరువాత, పాండవులు ద్రౌపదితో కలిసి పదవీ విరమణ చేసి, వారి ఏకైక వారసుడు అర్జునుడి మనవడు పరీక్షిత్తు కు సింహాసనాన్ని విడిచిపెట్టారు. వారి వస్తువులు సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి, వారు తమ కుక్కలతో కలిసి హిమాలయాలకు తమ చివరి తీర్థయాత్ర చేసారు. ఉలూపి గంగానదిలోని తిరిగి ఆమె తన రాజ్యానికి వెళ్లంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉలూపి&oldid=4104556" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%B2%E0%B1%82%E0%B0%AA%E0%B0%BF

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy