దబ్బాల రాజగోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దబ్బాల రాజగోపాల్ రెడ్డి
రాజ్ రెడ్డి
జననం (1937-06-13) 1937 జూన్ 13 (వయసు 87)
కాటూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
నివాసంUSA
జాతీయత భారతీయుడు - అమెరికన్
జాతితెలుగు
రంగములుకృతిమ మేథస్సు
రోబోటిక్స్
మానవ-కంప్యూటర్ అన్యోన్యత
వృత్తిసంస్థలుకార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్
చదువుకున్న సంస్థలుకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీ
న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం
స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)జాన్ మెకార్తీ
డాక్టొరల్ విద్యార్థులుజేమ్స్ బేకర్[1]
కై ఫు లీ [1]
హ్యారీ షుమ్
హాన్
ముఖ్యమైన పురస్కారాలులీజియన్ ఆఫ్ ఆనర్ (1984)
ట్యూరింగ్ అవార్డు (1994)
పద్మ భూషణ్ పురస్కారం (2001)
ది ఒకావా ప్రైజ్ (2004)
ది హోండా ప్రైజ్ (2005)
వాన్నెవర్ బుష్ అవార్డు (2006)

దబ్బాల రాజగోపాల్ రెడ్డి (రాజ్ రెడ్డి) (1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించాడు. ఆయన గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నాడు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువతీ, యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడింది.

బాల్యం, విద్యాభ్యాసం

రాజ్ రెడ్డి చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కాటూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి, తల్లి పిచ్చమ్మ గృహిణి. ఆయన తాత ఒక భూస్వామి. దాన ధర్మాల వల్ల వారి ఆస్తి కరిగిపోయింది. రాజ్ రెడ్డి తల్లి దండ్రులకు ఏడుగురు సంతానం. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. వారిలో రాజ్ రెడ్డి నాలుగోవాడు. రాజ్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన గ్రామంలోని పాఠశాలలోనే ఇసుకలో అక్షరాలు నేర్చుకున్నాడు. ఐదో తరగతి దాకా అదే ఊళ్ళో చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా శ్రీకాళహస్తిలో చదివాడు. పదో తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవడంతో మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం వచ్చింది. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే చదివాడు. ఇంటర్మీడియట్ లో ఆంగ్ల మాధ్యమంలో చేరినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మెల్లగా ఆంగ్లం మీద పట్టు తెచ్చుకుని ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రతిభ, మౌఖిక పరీక్ష ఆధారంగా గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరికింది.[2] 1958 లో చెన్నైలో మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం అన్నా విశ్వవిద్యాలయం) నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్నాడు.[3]

ఉద్యోగం

మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి కాగానే మద్రాసు పోర్టు ట్రస్టులో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన జీతం మూడు వందల రూపాయలు. ఉద్యోగం చేస్తున్నప్పుడే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియాలో పైచదువుల కోసం దరఖాస్తు చేశాడు. అలా 1960 లో ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు. మాస్టర్ డిగ్రీ చేసేటప్పుడే కంప్యూటర్ల మీద కలిగిన ఆసక్తి వలన ఐబీఎంలో ఉద్యోగంలో చేరి అక్కడే మూడేళ్ళపాటు పనిచేసి కంప్యూటర్ మెళకువలు తెలుసుకున్నాడు. కంప్యూటరు గురించి మరింత పరిశోధన చేయాలన్న తపనతో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీకి దరఖాస్తు చేశాడు. 1966 లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేటు సంపాదించాడు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మొట్టమొదటి డాక్టరేట్‌ అందుకున్న ఘనత ఆయనదే.[2]

అదే సంవత్సరం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించాడు. తరువాత పిట్స్ బర్గ్ లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాడు. అక్కడే ఆయన కెరీర్ కు బలమైన పునాది పడింది. కృత్రిమ మేధస్సు రంగం ప్రపంచాన్ని శాసిస్తుందని ఊహించి ఆ రంగం వైపు తన దృష్టి మళ్ళించాడు.ప్రస్తుతం సమాజంలోని సేవారంగంలో టెక్నాలజీ, సార్వత్రిక డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు మీద, భారతీయభాషలలో సంభాషణల అనువాదం మీద కృషి చేస్తున్నాడు[4].

బోధనా వృత్తి

రాజ్ రెడ్డి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కొద్ది కాలం ఆచార్యుడిగా పనిచేశాడు. తరువాత కార్నెగీ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ ప్రొఫెసరుగా ఉన్నాడు. 1960 నుండి రాజ్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఐబీఎంలో పనిచేశాడు.[5] 1969 లో ఆయన కార్నెగీ యూనివర్సిటీనందు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరాడు. 1973 నుండి ఆయన పూర్తి స్థాయి ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. 1984 లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు.[6]

ఆయన "రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్"కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఉన్నాడు[7] 1979 నుంచి [8] 1991 దాకా,[9] 1991 నుండి 1999 మధ్య కాలంలో కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ కంప్యూటర్ విభాగానికి డీన్ గా కూడా వ్యవహరించాడు. ఆ సమయంలోనే లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్, మానవ-కంప్యూటర్ అన్యోన్యత, సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ, ఇనిస్టిట్యూట్ ఫర్ సాఫ్ట్‌వేర్ రీసర్చ్ లను ఏర్పాటు చేశాడు.

ఐఐఐటీ సృష్టికర్త

అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ఐఐఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించాడు. విద్యార్థులకు ఐఐఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఐఐఐటీని ఏర్పాటు చేశాడు.[10] రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్కు ఛైర్మన్, ఛాన్సిలర్ గా వ్యవహరించాడు.[11] ఈయన 1999 నుండి 2001 సంవత్సరాల మధ్యలో ఏర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా ఉన్నాడు.[12][13]

రోబోటిక్స్ లో కృషి

భవిష్యత్తులో మనుషులు చేయాల్సిన చాలా పనుల్ని రోబోలు చేస్తాయని ఆయన బృందం ముందుగానే ఊహించింది. ఆయన పనిచేస్తున్న విశ్వవిద్యాలయానికి ఆ రంగంపైన ఆసక్తి కలిగి దానికోసం ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా కోట్ల రూపాయల ఖర్చుతో మొట్టమొదటి రోబోటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పి దానికి పన్నెండేళ్ల పాటు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పటికీ ప్రపంచంలో అదే అతిపెద్ద రోబోల పరిశోధనా కేంద్రం. రోబోలకు మాటలూ, భాషలూ నేర్పించడం, పదాల్ని గుర్తుపెట్టుకునే శక్తినివ్వడం, మాటల ద్వారా ఇచ్చిన ఆదేశాలకు స్పందించడం లాంటి అనేక అంశాలను మొదట అభివృద్ధి చేసింది శాస్త్రవేత్తల బృందంలో ఆయన ముఖ్యుడు. కృత్రిమ మేధస్సులో ఆయన పరిశోధనలకు గుర్తింపుగా ఆసియాలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మక అలన్‌ ట్యూరింగ్‌ అవార్డు దక్కింది. రోబోటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ స్థాయికొచ్చాక యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌కు పదేళ్లపాటు డీన్‌గా ఉన్నత హోదాలో పనిచేశాడు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.

బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఐటీ సలహా సంఘానికి కో-ఛైర్మన్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం నిరుపేదలకూ సామాన్యులకూ ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టుకు ఆయన చీఫ్‌ సైంటిస్టుగా పనిచేశాడు. తక్కువ ఖర్చులోనే కంప్యూటర్లను తయారు చేసి 80వ దశకం తొలిరోజుల్లోనే ఆఫ్రికా దేశాల్లోని పాఠశాలలకు వాటిని అందేలా చూశాడు. వైద్యం, రోడ్డు ప్రమాదాల నివారణ, మందుపాతర్లూ, ప్రకృతి విపత్తుల గుర్తింపు లాంటి అనేక రంగాల్లో ఉపయోగపడేలా రోబోల తయారీకి పునాది వేశాడు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మిట్టరాండ్‌ స్వయంగా అమెరికా వచ్చి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారమైన లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ను అందించాడు.[2] ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్పీచ్ రికగ్నిషన్‌లో చేసిన కృషికి రాజ్ రెడ్డికి కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం (సిహెచ్‌ఎం) 2021 ఫెలో అవార్డును ప్రదానం చేశారు.[14]

వ్యక్తిగతం

రాజ్ రెడ్డి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఆయనకు తంబలపల్లి జమీందారు కుటుంబానికి చెందిన అనురాధతో పెళ్ళి కుదిరింది. పెళ్ళైన తరువాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయానికి మారాడు. ఆయన తరఫున ఆయన భార్య వారి స్వంత గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంది. ఆయన నివాసం అమెరికాలో అయినా, హైదరాబాద్‌ ఐఐఐటీ పాలకమండలి ఛైర్మన్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ ఛాన్సలర్‌ హోదాలో హైదరాబాద్‌కీ, బెంగళూరులో ఉండే ఆయన అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ల ఇంటికీ తరచూ వస్తూనే ఉంటాడు.[2]

సూచికలు

  1. 1.0 1.1 "CMU Computer Science Ph.D. Awards by Advisor". Carnegie Mellon. Retrieved 3 August 2011.
  2. 2.0 2.1 2.2 2.3 ఎమ్వీ, రామిరెడ్డి (June 26, 2016). "ఈనాడు". రామోజీ రావు. ఈనాడు. Archived from the original on 18 June 2016. Retrieved 26 June 2016.
  3. "CMU-Software Engineering-Faculty-Raj Reddy". Carnegie Mellon. Archived from the original on 13 July 2012. Retrieved 18 August 2011.
  4. "Raj Reddy, the AI pioneer from India". Moneycontrol (in ఇంగ్లీష్). 2023-06-04. Retrieved 2023-06-13.
  5. "CMU's Raj Reddy fills lives with big questions". Pittsburgh Post-Gazette. 15 June 1998. Archived from the original on 13 జూన్ 2011. Retrieved 2 August 2011.
  6. "CS50: FIFTY YEARS OF COMPUTER SCIENCE". Carnegie Mellon. Archived from the original on 15 June 2010. Retrieved 2 August 2011.
  7. "History of the Robotics Institute". Robotics Institute, Carnegie Mellon. Archived from the original on 27 June 2015. Retrieved 2 August 2011.
  8. "Robotics Institute Founders". Carnegie Mellon University Article Dec. 2004, Vol. 1, No. 4. Archived from the original on 28 September 2011. Retrieved 20 August 2011.
  9. "Raj Reddy". rr.cs.cmu.edu. Archived from the original on 9 July 2011. Retrieved 24 July 2011.
  10. "Governing Council of International Institute of Information Technology". IIIT. Archived from the original on 28 జూలై 2011. Retrieved 2 August 2011.
  11. "Governing Council of Rajiv Gandhi University of Knowledge Technoloiges". RGUKT. Archived from the original on 27 July 2011. Retrieved 2 August 2011.
  12. "Draft Minutes of PITAC". Networking and Information Technology Research and Development(NITRD). Archived from the original on 5 November 2015. Retrieved 7 September 2011.
  13. "Former PITAC Members (1997-2001)". Networking and Information Technology Research and Development(NITRD). Archived from the original on 21 September 2011. Retrieved 7 September 2011.
  14. Jun 30, TNN /. "Raj Reddy receives Computer History Museum's Fellow Award - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లంకెలు